రియోలో భారత్‌కు మరో స్వర్ణం

రియోలో భారత్‌కు మరో స్వర్ణం

రియో డీ జనీరియో: రియోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. జావెలిన్ త్రో పురుషుల విభాగంలో రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర ఝఝారియా స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన పోటీలో 63.97 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సాధించడంతో పాటు భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. దేవేంద్ర 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లో కూడా భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. రియో స్వర్ణంతో రెండు స్వర్ణాలు గెలిచిన భారతీయుడుగా అతడు రికార్డు నెలకొల్పాడు. దేవేంద్రను భారత ప్రభుత్వం 2004లో అర్జున, 2012లో పద్మశ్రీతో గౌరవించింది. 36 ఏళ్ల దేవేంద్ర ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉన్నాడు. ఈ పతకంతో పతకాల పట్టికలో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్ 31వ స్థానంలో ఉంది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే మెరుగైన ప్రదర్శన కావడం విశేషం.