మన సమాజంలో లింగ వివక్ష ఇంకా పోలేదు. చాలాచోట్ల ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తున్నారు. భ్రూణహత్యల్ని నివారించడానికి మన దేశంలో లింగనిర్ధారణ పరీక్షలను నిషేధించారు. కఠిన చట్టాలను తెచ్చారు. అయినా ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు రావడం లేదనడానికి నిదర్శనం.. గర్భిణులను పుట్టేది ఆడో మగో తెలుసుకున్నారా అని అడగడం. ఆఖరికి సెలెబ్రిటీలకూ ఈ ప్రశ్న ఎదురవుతోందంటే సమాజం ఇంకా ఎంతగా మారాలో అర్థమవుతోంది. అయితే ఇలాంటి ప్రశ్నలకు కరీనా మాత్రం ఘాటుగా సమాధానమిస్తోంది.
ఇటీవల ఈ పటౌడీ దంపతులు బేబీమూన్ నిమిత్తం లండన్ వెళ్లి వచ్చారు. అక్కడ మామూలుగా వైద్య పరీక్షలు చేయించుకోగా వీరికి అబ్బాయి పుడతాడని వైద్యులు చెప్పారట. ఆ దేశాల్లో భ్రూణహత్యల సమస్య లేదు కాబట్టి పుట్టబోయే బిడ్డ ఆడో మగో ముందే చెప్తారు. పైగా అక్కడి వాళ్లు అది తెలుసుకుని దానికి తగినట్లుగా దుస్తులవీ కొనుక్కుని ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. కరీనా కూడా అక్కడ చూపించుకుంది కాబట్టి ఆమెకు అబ్బాయి పుడతాడని తెలిసినట్లు బాలీవుడ్‌లో చెప్పుకొంటున్నారు.
ఈ నేపథ్యంలో బెబో ఎక్కడికి వెళ్లినా కొందరు మీడియా వాళ్లు, ఇతరులు ఈ ప్రస్తావన తెస్తుండడంతో ఆమె కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. ‘ప్రస్తుతం నేను.. సైఫ్ ఎక్కడికి వెళ్లినా మీకు పుట్టేది పాపో బాబో తెలుసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా సరే అలా అడుగుతుంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. అసలు ఇంత నీచమైన ప్రశ్న వాళ్లకు ఎలా అడగాలనిపిస్తుందో? అలాంటి వారిని నేనొకటే ప్రశ్నిస్తున్నా. ఎవరు పుడితే ఏంటి? ఆడైనా, మగైనా తల్లిదండ్రులకు సమానమే. నేను ఆడపిల్లను కాబట్టి.. ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటా. మా తల్లిదండ్రులకు మేమిద్దరం ఆడపిల్లలమే. అయినప్పటికీ కొడుకు చేసిన దానికంటే ఎక్కువగానే చేసి వారి పేరు నిలబెట్టా’ అని మొహాన కొట్టినట్లు చెప్పింది కరీనా. ఒక బిడ్డకు జన్మనివ్వగల శక్తి మహిళకే ఉందని ఇలాంటివారంతా తెలుసుకోవాలి.. అని చెప్పింది కరీనా.
