సిక్స్‌ప్యాక్‌ బాడీ కావాలనుకుంటున్నారా..?




  • శరీరాకృతికి వ్యాయామ బాట
  • జిమ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యం

     ఆధునితకకు అలవాటుపడ్డ యువత సిక్స్‌ప్యాక్‌ కోసం ఆరాటపడుతుంది. అధిక బరువు తగ్గించుకునేందుకు, శరీర ఆకృతిని మార్చుకునేందుకు నిత్యం వ్యాయామం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్తూ చెమటోడ్చుతున్నారు. మరికొందరు శారీరక ప్రాధాన్యతతో సంబంధం ఉన్న ఉద్యోగాల్లో చేరేందుకు వ్యాయామం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కావడంతో విద్యార్థులు, యువత జిమ్‌, మైదానాల బాట పడుతున్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

పోటీల్లో పాల్గొనేవారు... 
వివిధ పోటీల్లో పాల్గొనేవారు నూనెతో కూడిన వస్తువులకు, పాస్ట్‌ఫుడ్‌, బేకరీఫుడ్‌లకు దూరంగా ఉండాలి. అరటిపండ్లకు ప్రాధాన్యమిస్తూ గుడ్డులోని పసుపు భాగాన్ని వదిలి తెలుపు భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం పాలు తాగాలి. వేరుశనగలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవాలి. సాధనకు 45 నిమిషాల ముందు కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించే ఆహారాన్ని తీసుకోవాలి. ఫలితంగా శారీరక శక్తి పెరుగుతుంది. రోజుకు 3 నుంచి 4 గంటలు సాధన చేస్తే శరీరం మంచి ఆకృతి సంతరించుకుంటుంది. 

లావు తగ్గాలంటే...
క్యాలరీస్‌, కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. కాంప్లెక్స్‌, కార్బోహైడ్రేట్స్‌ అయిన గోధుమలు, ముడిబియ్యం, చిలగడ దుంపలో లభించే ప్రోటీన్‌ ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు పండ్లకు ప్రాధాన్యమిస్తూ రోజూ 5లీటర్ల నీటిని తాగాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ తప్పకుండా చేయాలి. ఆహారం విషయం లో కొన్ని నియమాలు పాటించడం మేలు. 

బరువు పెరిగేందుకు..
కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువగా లభించే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఆహారంలో 2500 క్యాలరీలకు తక్కు వ కాకుండా ఎక్కువ మొత్తంలో లభించే ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రోటీన్స్‌, సిట్రజిన్‌ ప్యాట్స్‌ తీసుకుంటూ జ్యూస్‌, రోజుకు 5 లీటర్ల నీటిని, తాగడం వల్ల ఫలితముంటుంది. 

20 ఏళ్ల వరకు కఠిన సాధన వద్దు
20ఏళ్ల వయస్సు నిండే వరకు కఠిన సాధనకు దూరంగా ఉండడం మంచిది. చిన్నవయస్సులో వెయిట్‌ లిప్టింగ్‌ వ్యాయామం చేయడం మంచిదికాదని నిపుణులు సూచిస్తు న్నారు. జిమ్‌లో బరువైన వస్తువులు ఎత్తడం వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి సాధన వలన ఎదుగుదలకు తోడ్పడే కీళ్ల మధ్య ఉండే గ్రోత్‌ప్లేట్స్‌ పూర్తిస్థాయిలో దెబ్బతినే అవకాశముంది. 20 ఏళ్లు వచ్చే వరకు కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌, టెన్నీస్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ ఆటలతో పాటు, పరుగెత్తడం, సునాయాసమైన ఆసనాలు చేయడమే ఆరోగ్యానికి మంచిది. 

సూర్యోదయానికి ముందే..
ఎలాంటి వ్యాయామమైనా ఉదయం ఉప ఆహారానికి ముందే మొదలు పెట్టడం ఉత్తమం. ఆహారం తీసుకున్న పిదప వ్యాయామం చేయడం కష్టమైన పని. శారీరక అవయవాలు వ్యాయామానికి సహకరించాలంటే తీసుకున్న ఆహారం జీర్ణం కావాల్సిందే. అందుకు కనీసం రెండు గంటల సమయం పడుతుంది. వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే జిమ్‌కు చేరుకోవడం మంచిది. దీంతో శారీరక వ్యాయామం సునాయాసంగా సాగుతుంది. 

పల్లెల్లోనూ పెరిగిన జిమ్‌ కల్చర్‌
పల్లెల్లోనూ జిమ్‌ కల్చర్‌ రోజురోజుకూ పెరుగుతోంది. జిమ్‌కు సంబంధించిన వస్తువులను యువకులు ఊళ్లలోకి తీసుకొచ్చుకొని వ్యాయామాలు చేస్తున్నారు. ఎవరైనా సరే ఉదయం 8 గంటలలోపే వ్యాయామాన్ని పూర్తి చేయాలి. గ్రామాల్లో ఎన్నో అవకాశాలు యువత సాధనకు లభిస్తాయి. పార పనులు చేయడం, నీటి బకెట్లు తీసుకెళ్లడం, వ్యవసాయ పనులు చేయడం వంటి వాటివల్ల శారీరక వ్యాయామం లభిస్తుంది. ఈత కొట్టడం అన్ని శరీర భాగాలకు ఉత్తమ సాధన. ఈ విధంగా యువత శారీరక సాధన చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు దేహదారుఢ్యం మెరుగుపడుతుంది. జ్ఞానేంద్రియాలు అదుపులోకి వచ్చి ఆలోచనా విధానంలో చురుకుదనం పెరుగుతుంది. !