ఆ క్రీమ్‌ రాసుకున్న తరువాతే... ఆమె అందంగా తయారైందా: వర్మ

ఆ క్రీమ్‌ రాసుకున్న తరువాతే... ఆమె అందంగా తయారైందా: వర్మ

‘తోచీ తోచనమ్మ తోడికోడలు బుగ్గ గిల్లింది’ అన్నట్టు ఉంది రాంగోపాల వర్మ వ్యవహారం. ‘ట్విట్ట’డానికి వర్మకు ఏ విషయం దొరకనట్టుంది. అందుకే యామీ గౌతమ్‌ అందం మీద పడ్డాడు. దాంతో ఇప్పుడు అందరికీ యామీ అందం మీద పెద్ద అనుమానమే వస్తోంది. అసలు సంగ తేమిటంటే... గత కొన్ని సంవత్సరాలుగా యామి పెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌ చేస్తోంది. ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు కానీ, మొన్న రాంగోపాల్‌వర్మకి మాత్రం ఆ అనుమానం వచ్చేసిందట! ఆ యాడ్‌లో యామీ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ రాసుకుంటే తెల్లగా మెరిసిపోతారు అని చెబుతూ, తను కూడా అది వాడిన తరువాతే అందంగా ఉన్నానన్న సంగతి చెబుతుంది. ఈ యాడ్‌ చూసిన వారు క్యాజువల్‌గా తీసుకున్నా వర్మ తీసుకోలేకపోయాడు. అందుకే యామీ మీద ప్రశ్నల అస్త్రం సంధించాడు. ‘యామీ అంతకు ముందు అందంగా లేదా? ఆ క్రీమ్‌ రాసుకున్న తరువాత అందంగా తయారైందా? అయితే ఆ క్రీమ్‌ రాసుకున్న వారందరూ యామీ అంత అందంగా తయారవుతారా?’ ఇలాంటి ప్రశ్నలను ట్విట్టర్‌లో సంధించేశాడు. దాంతో తన పనైపోయింది అనుకున్నాడే తప్ప యామీ ఎంత ఇబ్బంది పడుతుందో ఊహించలేదు అంటున్నారు యామీ సన్ని హితులు. వర్మ ట్వీట్‌ చూసిన తరువాత తను అందగత్తెనా? కాదా? అన్న అనుమానం యామీకే కలిగిందట! మొత్తానికి వర్మ ఒక్క ట్వీట్‌తో అందరినీ డైలమాలో పడేశాడు అంటున్నారు సినీ జనాలు.